న్యూఢిల్లీ: వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఉన్న హిందూ దేవతా విగ్రహాన్ని థాయ్లాండ్ ధ్వంసం చేసిందని కాంబోడియా ప్రభుత్వం బుధవారం ఆరోపించింది. శ్రీమహావిష్ణు విగ్రహాన్ని బుల్డోజర్ ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌద్ధులు, హిందూ భక్తులు ఆరాధించే ప్రాచీన ఆలయాలు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్లు కాంబోడియా ప్రభుత్వ ప్రతినిధి కిమ్ చంపాన్హా ప్రకటించారు. యాన్ సెస్ ప్రాంతంలోని తమ భూభాగం లోపల ఈ విగ్రహం ఉందని ఆయన తెలిపారు. థాయ్లాండ్ సరిహద్దుల నుంచి 100 మీటర్ల(328 అడుగులు) లోపల కాంబోడియా భూభాగంలో 2014లో నిర్మించిన ఈ ఆలయంలోని విగ్రహాన్ని థాయ్లాండ్ ఆదివారం ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ అమర్యాదకర చర్యను విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది.