శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి స్థానికేతర వ్యక్తిని ఉగ్రవాదులు కాల్పి చంపారు. (Terrorists kill non local) శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తిని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతుడు బీహార్‌కు చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం జైనాపోరాలోని వదునా ప్రాంతంలో రోడ్డు పక్కన స్థానికేతర వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించడాన్ని స్థానికులు గమనించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికేతర వ్యక్తిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు ధృవీకరించారు. మృతుడు బీహార్‌కు చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే భద్రతా దళాలు, పోలీసులు కలిసి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజులకే ఈ సంఘటన జరిగింది.