Jammu Kashmir | శ్రీనగర్ : ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను భారత బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిఘా వర్గాలు కూడా ఉగ్రవాదుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాల ఆదేశాలతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఆర్మీ బలగాలు కలిసి సంయుక్తంగా మాచిల్ జిల్లాలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదులు భారీ స్థాయిలో దాచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏకే 47 తుపాకులు, మేగజైన్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఐదు ఏకే-47 రైఫిల్స్, ఎనిమిది ఏకే-47 మేగజైన్లు, ఒక పిస్తోల్, మరో పిస్తోల్ మేగజైన్, 660 రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుప్వారా జిల్లాలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని విధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల అప్రమత్తం కావడంతో.. ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకుని, అల్లర్లకు అడ్డుకట్ట వేశారు. పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ జమ్మూకశ్మీర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న పహెల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.