బెంగళూరు: పహల్గామ్ ఉగ్రవాదులు మతం గురించి అడగలేదని కర్ణాటక మంత్రి తెలిపారు. ‘కాల్పులు జరిపే వ్యక్తి ఆగి కులం, మతం గురించి అడుగుతాడా. కాల్పులు జరిపి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి’ అని అన్నారు. (Karnataka Minister) ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్, పహల్గామ్ ఉగ్రదాడి గురించి మీడియాతో మాట్లాడారు. హంతకులు కాల్పులకు ముందు మతాన్ని అడిగి ఉంటారని తాను భావించడం లేదని చెప్పారు. ‘కాల్పులు జరిపే వ్యక్తి కులం, మతం అడుగుతాడా? కాల్చివేసి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్‌గా ఆలోచించు. అక్కడ నిలబడి అడిగి కాల్చడు’ అని అన్నారు.
కాగా, హేయమైన ఉగ్రదాడిపై దేశం కలత చెందిందని మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ తెలిపారు. అయితే దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ‘ఉగ్రదాడి చేస్తున్నప్పుడు వారు మతం గురించి అడగలేదని నేను భావిస్తున్నా. ఒకవేళ వారు అలా చేస్తే, మతం ఆధారంగా సమస్యను రాజకీయం చేయడానికి ఇలాంటి ప్రకటనను ఉపయోగించుకునే ఈ పిచ్చి ఉండకూడదు’ అని అన్నారు.
మరోవైపు మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఘాటుగా స్పందించారు. ‘కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్వి అనాగరికమైన, దుర్మార్గపు వ్యాఖ్యలు. దుఃఖిస్తున్న కుటుంబాల సమగ్రతను అవమానించాయి. పాకిస్థాన్ మద్దతుతో పహల్గామ్ ఉగ్రదాడిలో ఊచకోత కోసిన బాధితుల ధైర్యసాహసాలను అవమానపరిచాయి. జాతీయ సంతాప సమయంలో కూడా మతతత్వ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ప్రసన్నం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తన ఆత్మను తాకట్టుపెట్టింది’ అని విమర్శించారు.