న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గత ఏడాదిలో జరిగిన టన్నల్ దాడిలో కూడా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 2024 అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్‌లోని గండేర్బాల్ జిల్లా సోనామార్గ్‌లోని జెడ్ మోర్ సొరంగం ప్రాజెక్టు వద్ద ఉగ్రదాడి జరిగింది. ప్రైవేట్ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్న కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక డాక్టర్ సహా ఆరుగురు కార్మికులు మరణించారు. ఆ కంపెనీకి చెందిన రెండు వాహనాలను కూడా ఉగ్రవాదులు తగులబెట్టారు. అలాగే ఇన్సాస్ రైఫిల్‌ను సంఘటన స్థలంలో వదిలివెళ్లారు.
కాగా, గత ఏడాది జరిగిన టన్నల్ దాడితోపాటు ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మద్దతున్న ఉగ్రవాదులు పాల్గొన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గామ్ మారణ హోమంలో పాల్గొన్న అనేక మంది ఉగ్రవాదులు టన్నల్ దాడిలో కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నాయి.
మరోవైపు 2024 దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకడైన జునైద్ అహ్మద్ భట్‌ను ఆ ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ గ్రూప్‌నకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా ఆ తర్వాత హతమార్చినట్లు వెల్లడించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న లష్కరే ఉగ్రవాది హషీం ముసా అలియాస్ సులేమాన్, సొరంగం దాడిలో కూడా పాత్ర పోషించాడని నిఘా వర్గాలు నిర్ధారించాయి.