Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. కడపటి వార్తలు అందే సరికి కచ్ జిల్లాలోని జకావ్ పోర్టు సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి వర్షాలు పడ్డాయి. తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు వీచడంతో ద్వారక జిల్లాలో చెట్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి.
గుజరాత్ కచ్ ఏరియాతో పాటు దక్షిణ రాజస్థాన్‌పై బిపర్జాయ్ ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలతో వరదలు కూడా సంభవించొచ్చని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర సింగ్ బుందేలా అన్నారు. ద్వారక, పోర్బందర్, జామ్‌నగర్, మోర్బీ తీర ప్రాంతాల్లో 3 నుంచి 6 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అతి తీవ్ర తుఫానుగా మారిన బిపర్జాయ్కి చెందిన ఫోటోలను యూఏఈకి చెందిన వ్యోమగామి సుల్తాన్ అల్ నెయిది అంతరిక్ష కేంద్రం నుంచి క్లిక్ మనిపించారు.