Madhya Pradesh | ఇండోర్: జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రాలను విక్రయిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడు పదో తరగతి కుర్రాడని తెలిసి ఆశ్చర్యపోయారు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాకు చెందిన నిందితుడు జీవితాన్ని విలాసంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఉద్యోగార్థులను మోసం చేయాలనుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రాంలో ఓ చానల్‌ను క్రియేట్ చేశాడు. దాని ద్వారా మోసానికి తెరతీశాడు.
జూన్ 23న జరగనున్న ఎంపీపీఎస్సీ ప్రిలిమినరీ రౌండ్ పేపర్లు లీకయ్యాయని, అవి తన వద్ద ఉన్నాయని ప్రచారం చేశాడు. ఒక్కో దాన్ని రూ.2,500 విక్రయిస్తానని బేరం పెట్టాడు. ఇలా ఐదుగురిని మోసం చేశాడు. నిజానికి అతడి వద్ద ఎలాంటి పేపర్లు లేవని పోలీసులు తెలిపారు. అతడికి నోటీసులిచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నీట్ పేపర్ విక్రయిస్తానని గతంలోనూ మోసానికి పాల్పడ్డాడని, ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని పోలీసులు తెలిపారు.