న్యూఢిల్లీ: జొమాటో/ఎటర్నల్ వ్యవస్థాపకుడు, సీఈవో దీపీందర్ గోయల్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్నపుడు, ప్రేక్షకుల దృష్టి ఆయన కణతపై ఉన్న చిన్న పరికరం మీద పడింది. చాలా మంది దానిని గుర్తించడానికి జూమ్ చేసి చూశారు. అది మెటాలిక్ రంగులో క్లిప్ వంటి పరికరం అని తెలిసింది. దానిని టెంపుల్ అంటారు. మెదడులో రక్త ప్రవాహాన్ని ఇది వర్తమానంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. మెదడులో నిరంతరం రక్తం ఎలా ప్రవహిస్తుందో గమనిస్తుంది. మెదడుకు రక్తం ప్రవహించే తీరును బట్టి నరాల ఆరోగ్యం, వృద్ధాప్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ డాటాను విశ్లేషించి, వయసు పెరిగేకొద్దీ తలలో ఏం జరుగుతుందో పరిశోధకులు అర్థం చేసుకోగలుగుతారు. గోయల్ ఈ డివైస్‌ను సుమారు ఓ సంవత్సరం నుంచి పరీక్షిస్తున్నారు. ఆయన, తన బృందంతో కలిసి గురుత్వాకర్షణ శక్తి వల్ల వయసు పెరుగడంపై అధ్యయనం చేస్తున్నారు. రక్త ప్రసరణ, వయసు పెరుగుతుండటంపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం గురించి పరిశీలిస్తున్నారు. గోయల్ వ్యక్తిగత ఆసక్తితో ఈ ప్రాజెక్ట్ కోసం రూ.225 కోట్ల తన సొంత సొమ్మును పెట్టుబడి పెట్టారు.