Panther Attack | రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లో మ్యాన్ ఈటర్ పాంథర్ (man-eating panther) వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఓ ఆలయ పూజారి (Temple priest) ఈ పాంథర్ దాడిలో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. గోంగుడా గ్రామంలో గత కొంత కాలంగా మ్యాన్ ఈటర్ పాంథర్ వరుస దాడులకు (Panther Attack) పాల్పడుతోంది. ఆదివారం రాత్రి కూడా ఓ ఆలయ పూజారిపై దాడి చేసింది. పూజారి మహరాజ్ విష్ణు గిరి ఆదివారం రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. తాజా దాడితో గత 11 రోజుల్లో ఇది ఏడో మరణం అని వెల్లడించారు.
మరోవైపు పాంథర్ వరుస దాడులతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఆ ప్రాంతంలో ఉచ్చులు బిగించారు. మరోవైపు పాంథర్ వరుస దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక పాఠశాలలను అధికారులు మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు సైతం సాయంత్రం వేళల్లో తమ ఇళ్లను వదిలి వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. తమ వెంట ఆయుధాలుగా కర్రలు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఘటనల్లో ఒకే పాంథర్ దాడి చేసిందా లేక గుంపుగా ఉన్నాయా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే, అన్ని సందర్భాల్లో జంతువు కదలికలు, దాడి స్వభావం ఒకే విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మ్యాన్ ఈటర్ పాంథర్‌ను బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read..
Rhino | బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్ వీడియో