Heat Wave | సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): పొద్దుగాల తొమ్మిదింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్ మార్చి కూడా దాటలే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఇలా ఉంది. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మార్చి మొదటి నుంచే 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం లానినా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షకాలంలో సమృద్ధి వానలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వాతావరణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టు చెప్తున్నారు.
ఏమిటీ.. ఎల్నినో? లానినా?
వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలనే ఎల్నినో, లానినాగా చెప్తారు. పసిఫిక్ మహా సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు సాధారణంగా ఎల్నినో, లానినాకు కారణంగా పరిణమిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్నినో సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్వో)’ వలయాలుగా పిలుస్తారు. ఈఎన్ఎస్వోలో ఉష్ణ దశను ఎల్నినో అని, చలి దశను లానినాగా పేర్కొంటారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. ఎల్నినో కారణంగా ఎండలు మండిపోతాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. లానినా కారణంగా మంచి వానలు కురుస్తాయి. మన దేశంలో 70 శాతం వానలకు కారణమయ్యే నైరుతి రుతుపవనాలను కూడా ఈ ఎల్నినో, లానినాలే ప్రభావితం చేస్తాయి.
భిన్నమైన పరిస్థితులు
పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ఏర్పడే ఈఎన్ఎస్వో వలయాలు ప్రతీ రెండు, మూడేండ్లకు ఒకసారి మారుతాయి. అంటే, ఒకసారి లానినా పరిస్థితులు ఉంటే, ఆ వచ్చే ఒకట్రెండేండ్లూ లానినానే ఉండి మంచి వర్షాలు కురుస్తాయి. ఎండల తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. నిరుడు లానినా సైకిల్ మొదలైంది. అందుకే గత వానకాలం సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. ఈ లెక్కప్రకారం లానినా ప్రభావం ఈసారి కూడా ఉండాలి. అంటే ఈసారి ఎండల తీవ్రత తక్కువగా నమోదవ్వాలి. అయితే అందుకు భిన్నంగా భానుడు ఫిబ్రవరి నుంచే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.
వానలు తక్కువే
ప్రస్తుతం కొనసాగుతున్న లానినా పరిస్థితులు క్రమంగా బలహీనపడుతున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) పేర్కొంది. మార్చి నుంచి మే నెల నాటికి లానినా ప్రభావం తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశం 60 శాతం మేర ఉండనున్నట్టు అంచనా వేసింది. ఏప్రిల్-జూన్ నాటికి ఇది 70 శాతానికి పెరుగనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో ఎల్నినో పరిస్థితులు కొంతమేర పుంజుకోవచ్చని అభిప్రాయపడింది. ఫలితంగా మే చివరినాటికి లానినా ప్రభావం చాలావరకూ తగ్గిపోనున్నట్టు వివరించింది. కాగా, లానినా ప్రభావం తగ్గుతుండటం, ఎల్నినో పుంజుకొనే అవకాశాలు పెరుగుతుండటంతో వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ వల్లే
ప్రస్తుతం లానినా ప్రభావం ఉన్నప్పటికీ, మొన్నటి ఫిబ్రవరి నెలలో.. 124 ఏండ్లలో ఎన్నడూ చూడనిస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. లానినా ప్రభావం క్రమంగా బలహీన పడుతుండటంతోనే ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మేలో భానుడి భగభగలు మరింతగా పెరుగుతాయి. వానకాలంలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే వాతావరణంలో ఈ ఊహించని పరిణామాలు చోటుచేసుకొంటున్నాయని, ఎల్నినో, లానినా సైకిల్లో తేడాలకు కూడా ఇదే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వానలు తక్కువే!
ప్రస్తుతం లానినా తటస్థంగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మే తరువాత ఎల్నినో వచ్చి చేరొచ్చు. గతంలో రెండు మూడేండ్లకోసారి వానలతో పాటు ఆ దఫా తరువాత కరువు కూడా సంభవించేది. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల అధిక వానలు, అధిక వరదలు క్రమంగా రావడం జరుగుతోంది. లేదంటే క్రమంగా కరువు ముంచుకొస్తున్నది. నిరుడు వానలు కురిసినందువల్ల 2025లో అనుకున్న స్థాయిలో వానలు పడకున్నా పెద్దగా నష్టమైతే లేకపోవచ్చు.
– సాయి ప్రణీత్, వెదర్
మ్యాన్సాధారణ వానలే
వచ్చే జూన్-సెప్టెంబర్ మాసంలో ఎల్నినో ప్రభావం ఉండనున్నట్టు డబ్ల్యూఎంవో అంచనాలను బట్టి అర్థమవుతున్నది. దీంతో దేశంలో సమృద్ధి వర్షపాతం కాకుండా సాధారణ వర్షాలే పడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
– మహేశ్ పలావత్, స్కైమెట్ వెదర్ కంపెనీ శాస్త్రవేత్త
అందుకే మార్పులు
గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకొంటున్నాయి. భూతాపం వల్ల ఎల్నినో, లానినా సైకిల్ కూడా మారుతున్నది. ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న భిన్నమైన మార్పులకు ఇదే కారణమని భావించొచ్చు.
-శివానంద పాయి, ఐఎండీ శాస్త్రవేత్త
రాత్రిళ్లు ఉక్కపోత అందుకే
జనాభా పెరగడం, పశుషోషణ తగ్గడం, చెరువులను పొతం పెట్టడం, గాలి, నీరు కలుషితమవడం వల్లనే రాత్రి వేళ ఉక్కబోత.
-ధర్మరాజు, వాతావరణ అధికారి.