దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అములచేయాలని జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు వివరించారు. ఢిల్లీలో రాకాబ్గంజ్ గురుద్వారా సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్రీయ కిసాన్ మహాసంఘం జాతీయస్థాయి రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. మూడు నల్ల చట్టాల ఉపసంహరణ, ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం హామీల అమలు జరుగకపోవడంతో దీనిపై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు శివకుమార్ కక్కాజీ అధ్యక్షతన సమావేశమయ్యారు. డబ్ల్యూటీవో నుంచి భారత్ వైదొలగాలని, రైతులను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానం చేసింది
తెలంగాణ రైతు పథకాల ప్రస్తావన..
ఈ సమావేశంలో దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు పాల్గొని, ఉద్యమ కార్యాచరణకు తమ వంతు సహకారాన్ని ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న రైతు బంధు , రైతు బీమా, 24/7 ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కనీస మద్దతు ధరతో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విధానాన్ని సమావేశంలో పాల్గొన్న వారికి, వివరించారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు తెచ్చేలా ఒత్తిడి తేవాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదించారు.