GPS | హైదరాబాద్: సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుపోయిన కరీంనగర్ వ్యక్తి అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు. 27 ఏళ్ల మొహమ్మద్ షేజాద్ఖాన్ సౌదీ అరేబియాలోని ఓ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. సూడాన్‌కు చెందిన సహచర ఉద్యోగితో కలిసి ఇటీవల కారులో బయటకు వెళ్లిన షేజాద్ జీపీఎస్ సిగ్నల్ కోల్పోవడంతో దారి తప్పి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎడారిగా పేరుపొందిన రబ్ అల్ ఖలీ ఎడారిలో చిక్కుకుపోయాడు.
650 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ఎడారిలో ఎటునుంచి ఎటు వెళ్లాలో తెలియక ఇద్దరూ అవస్థలు పడ్డారు. దీనికితోడు ఫోన్లో చార్జింగ్ అయిపోయి స్విచ్ఛాఫ్ కావడంతో సాయం కోసం ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కారులో పెట్రోలు కూడా నిండుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఎడారిలో తిండీతిప్పలు లేక, దాహం తీర్చుకునేందుకు చుక్క నీరు కనిపించకపోవడంతో అల్లాడిపోయారు. ఎడారి వేడికి డీహైడ్రేషన్‌కు గురై చివరికి అత్యంత దయనీయ స్థితిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల తర్వాత వీరి మృతదేహాలను వారి వాహనం పక్కనే గుర్తించారు.