హైదరాబాద్, నవంబర్ 8: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై వివాదం ముదురుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతూ విపక్ష ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌లో తమకు గవర్నర్లు తీవ్ర తలనొప్పులు సృష్టిస్తున్నారని ప్రభుత్వాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. గవర్నర్ల తీరు కూడా అలాగే ఉన్నది.
వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వాలు ఏ విధాన నిర్ణయం తీసుకొన్నా, అసెంబ్లీలో ఏ బిల్లు పాస్ చేసి పంపినా కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టు సవాలక్ష ప్రశ్నలతో ప్రభుత్వాలను గవర్నర్లు చికాకు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రాష్ర్టానికి గవర్నర్‌గా కొనసాగుతూ కొందరు ఇతర రాష్ర్టాల రాజకీయాల్లో కూడా వేలు పెడుతుండటం మరిన్ని సమస్యలకు తావిస్తున్నది.
కేరళలో పోరాటం తీవ్రం
దేశంలో ఇటీవల కాలంలో ఎక్కడా చూడనంత తీవ్రంగా కేరళలో గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదమవుతున్నది. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ స్వయంగా తానే ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఓపిక నశించి ఏకంగా గవర్నర్‌పై రాష్ట్రవ్యాప్త ఉద్యమమే మొదలుపెట్టిందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆయన అసెంబ్లీలో సభనుద్దేశించి ప్రసంగించి.. చివరలో ఈ ప్రసంగ పాఠంతో తనకు సంబంధం లేదు అని ప్రకటించి వెళ్లిపోయారు.
ప్రభుత్వంతోపాటు ఆయనను ప్రశ్నించిన మీడియాను కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు రాకుండా నిషేధించారంటే గవర్నర్ తీరు ఎలా ఉన్నదో అర్థమవుతున్నది. విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ఏ బిల్లునూ ఆయన వివాదం సృష్టించకుండా ఆమోదించిన దాఖలాలు లేవు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన ప్రభుత్వం ఈ నెల 15న ఏకంగా రాజ్‌భవన్ ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి గవర్నర్‌పై కరపత్రాలు పంచే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది.
యూనివర్సిటీల వైస్చాన్స్లర్లు రాజరిక ప్రభువులుగా మారారని ఆరోపిస్తూ అందరినీ రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించటంతో.. అక్టోబర్ 26న కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం ధర్నా నిర్వహించింది. ఎర్నాకులంలో మీడియా సమావేశం పెట్టిన ఆరిఫ్ మహమ్మద్, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన ఇద్దరు జర్నలిస్టులను సమావేశం నుంచి బలవంతంగా బయటకు గెంటేయించారు. గతంలో కూడా ఆయన పలువురు జర్నలిస్టులను ‘క్యాడర్ జర్నలిస్టులు’ అని అవమానించారు. దీంతో గవర్నర్‌కు వ్యతిరేకంగా కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
బిల్లులన్నీ పెండింగ్
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం శాసనసభలో ఏదైనా బిల్లును పాస్ చేసి గవర్నర్‌కు పంపితే.. దానిపై ఏమైనా అనుమానాలుంటే బిల్లును ఒకసారి తిప్పి పంపే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ఆ బిల్లులో ఏవైనా మార్పులు చేసి, లేదంటే ఉన్నదున్నట్టుగా ప్రభుత్వం మరోసారి పంపితే గవర్నర్ తప్పక ఆమోదం తెలుపాలి. కానీ, ఆరిఫ్ మహ్మద్ చాలా తెలివిగా రెండోసారి పంపిన బిల్లులన్నీ తనవద్దే పెట్టుకొని కాలయాపన చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పంపిన ఒక్క బిల్లును కూడా ఆయన ఏ వివాదం సృష్టించకుండా ఆమోదించిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తమిళనాడులో ఇద్దరు గవర్నర్ల రాజకీయం
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఇద్దరు గవర్నర్ల నుంచి తలనొప్పులు ఎదురవుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడుకు చెందినవారు. గవర్నర్ కాకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ సమయంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండేవారని పరిశీలకులు చెప్తుంటారు. తాజాగా ఆమె తెలంగాణ గవర్నర్‌గా ఉంటూనే తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టారు. డీఎంకే అధినాయకత్వం.. అంటే కరుణానిధి కుటుంబం తెలుగువాళ్లని, తమిళులు కాదని ఇటీవల ఆమె ఓ ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతున్నది.
తమిళిసైకి డీఎంకే అధికార పత్రిక మురసోలి గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘తెలంగాణ గవర్నర్ తమిళనాడులో రాజకీయాలు చేయటం మానుకోవాలి. అది ఆమె పనికాదు. ఒకవేళ రాజకీయమే చేయాలనుకొంటే గవర్నర్ పదవికి రాజీనామా చేసి రావాలి. ఇప్పటికే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన పరిధి దాటి ప్రవర్తిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. స్టాలిన్ ప్రభుత్వం కూడా సొంత గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నది. ఆయనను గవర్నర్ పదవి నుంచి దింపేసేందుకు భావసారూప్యంగల పార్లమెంటు సభ్యులంతా కలిసి రావాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, జార్ఖండ్‌లో గవర్నర్ రమేశ్ బయాస్తోనూ గొడవలు జరుగతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సర్కారుకు తమిళిసై తలనొప్పులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న గవర్నర్ నరసింహన్ కూడా తమిళనాడువాసే. ఆయన ప్రభుత్వంతో ఏనాడూ వివాదాలకు వెళ్లలేదు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారన్న అపవాదు ఉన్నప్పటికీ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎంతో సఖ్యతగా ఉండేవారు. ఆయన తర్వాత వచ్చిన తమిళిసై మొదట్లో బాగానే ఉన్నా..
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న యూనివర్సిటీల కామన్ ఎంట్రన్స్ బిల్లుపై తనవద్దకు వచ్చి చర్చించాలని విద్యాశాఖ మంత్రిని ఆదేశించటం కలకలం రేపింది. ప్రభుత్వానికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించటం కూడా ప్రభుత్వంతో ఆమె తీరు బాగాలేదనేందుకు సాక్ష్యాలని రాజ్యాంగవేత్తలు పేర్కొంటున్నారు. పలు బిల్లులను గవర్నర్ చాలాకాలంగా తనవద్దే పెట్టుకొన్నారు. దీంతో గవర్నర్ తీరుపై అధికార టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది.