పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి దుమ్ముదులిపేసింది. 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మహాగఠ్బంధన్ను మట్టికరిపించింది. ఏకంగా విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి అంచున నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారులు తేజస్వీ యాదవ్ (RJD), తేజ్ ప్రతాప్ యాదవ్ (JJD) తాము పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో వెనుకబడిపోయారు.
ఆర్జేడీలో ముఖ్యమనేత, మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఈ ఎన్నికల్లో రాఘోపుర్ (Raghopur) నుంచి బరిలో దిగారు. ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే 3 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మొదటి నుంచి ఆ స్థానంపై లాలూ కుటుంబానికి గట్టి పట్టు ఉన్నది. అయినప్పటికీ తేజస్వీ ఓటమి బాటలో పయణిస్తున్నారు. 2015 నుంచి తేజస్వీ ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 38 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన తల్లిదండ్రులు రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ ఇదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిగా ఉన్న సతీశ్ కుమార్.. రబ్రీదేవిపై విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు తేజస్వీపై గెలుపు దిశగా పనయణిస్తున్నారు.
ఇక ఎన్నికల ముందు ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ సొంతంగా జనశక్తి జనతాదళ్ (JJD) అనే పార్టీని ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో మహువా స్థానం నుంచి బరిలో నిలిచారు. కేవలం 2121 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఎల్జేపీ (ఆర్వీ)కి చెందిన అభ్యర్థి సంజయ్ కుమార్ ఆయనపై 10 వేల ఓట్లకుపైగా మెజార్టీలో ఉన్నారు. దీంతో ఆయన ఓటమి తప్పదని తేలిపోయింది.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఎన్డీయే ముందంజలో దూసుకెళ్తోంది. కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 191 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ హాఫ్ సెంచరీని కూడా చేరుకోలేకపోయింది. ప్రస్తుతం 47 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. 2020 ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ ఏకంగా 114 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.