Tejashwi Yadav : బీహార్ (Deputy CM) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) రాబోయే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అందులో ఒకటి తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపుర్ కాగా, మరొకటి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ (JDU) కు బలమైన పట్టున్న ఫుల్పరాస్ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు మధుబని జిల్లా పరిధిలోని ఫుల్పరాస్ నియోజకవర్గం 2010 నుంచి జేడీయూకు అడ్డాగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ జేడీయూకు చెందిన శీలా కుమారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కృపానాథ్ పాఠక్‌పై సుమారు 11 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాంటి బలమైన స్థానంలో తేజస్వి నేరుగా పోటీకి దిగడం ద్వారా అధికార పార్టీకి గట్టి సవాల్ విసరాలనే వ్యూహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ విజయం సాధిస్తే అది ఆర్జేడీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతోపాటు జేడీయూకు రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక, రాఘోపుర్ నియోజకవర్గం యాదవ్ కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయంగా అండగా నిలుస్తోంది. గతంలో తేజస్వి తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2015లో రాజకీయ అరంగేట్రం చేసిన తేజస్వి, 2020 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 38 వేల ఓట్లకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఒకవైపు సురక్షితమైన సొంత స్థానాన్ని నిలబెట్టుకుంటూనే, మరోవైపు ప్రత్యర్థి కోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో తేజస్వి ఈ డబుల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.