పాట్నా: బీహార్లో తేజస్వి యాదవ్ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెండు ఓటర్ గుర్తింపు కార్డులున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కార్డులు వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదై ఉన్నాయని విపక్షాలు ఆధారాలు చూపాయి.
దీనిపై ఎన్నికల సంఘం విచారణ చేయాలని అవి డిమాండ్ చేశాయి. రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో రెండు నియోజక వర్గాల్లో విజయ్ సిన్హా పేరు ఉంది. దీనిపై ఆయనకు ఎప్పుడు నోటీస్ పంపిస్తారని ఆ పార్టీ ఈసీని ప్రశ్నించింది. ఈ విషయంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ ఎన్నికల సంఘం మోసానికి పాల్పడిందా అని ప్రశ్నించారు.