Tejpratap Yadav : తన తమ్ముడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ప్రజా నాయకుడు కాలేడని ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) వ్యాఖ్యానించాడు. బీహార్‌లో జేపీ లోహియా, కర్పూరీ ఠాకూర్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితర కొందరు సీనియర్ నేతలు మాత్రమే ప్రజా నాయకులని చెప్పారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందే లక్షణాలు తేజస్వి దగ్గర లేవని విమర్శించారు.
కేవలం తమ తండ్రి పేరును చెప్పుకుని మాత్రమే తేజస్వి ఈస్థాయికి వచ్చాడని తేజ్‌ప్రతాప్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోనని అన్నారు. తాను ఇక ఆర్జేడీతో కలువబోనని, తనకు ఏ పదవులపైన వ్యామోహం లేదని చెప్పారు. ఆర్జేడీ నుంచి ఏదైనా పదవిని ఆఫర్ చేసినా తాను తిరస్కరిస్తానని తెలిపారు. ఎప్పుడూ ఎవరితోనూ పొత్తు కలిసే ప్రసక్తే లేదని చెప్పారు.
అంతేగాక మహువా అసెంబ్లీ స్థానంలో తనకు ఎదురేలేదని తేజ్‌ప్రతాప్ యాదవ్ అన్నారు. తాను గెలిచిన తర్వాత మహువాలో క్రికెట్ స్టేడియం కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహువా స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందని తాను హామీ ఇస్తున్నానని తెలిపారు.