Tejas fighter jet: దేశీయంగా తయారు చేసిన సింగిల్ సీటర్ ఫైటర్ జట్ తేజస్ ఇవాళ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేడంతో జట్ పూర్తిగా కాలి బూడిదైంది. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో అది కూలిపోవడం ఇదే తొలిసారి. ఈ 23 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ ఫైటర్ జట్ కూలిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తేజస్ సింగిల్ సీట్ ఫైటర్ జట్ గురించి వివరంగా తెలుసుకుందాం…
సింగిల్ సీటర్ ఫైటర్ జట్ తేజస్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వినియోగిస్తున్నారు. దీంతోపాటు ట్విన్ సీట్ ట్రెయినర్ వేరియంట్‌ను కూడా ఎయిర్‌ఫోర్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌తోపాటు ఇండియన్ నేవీలో కూడా ట్విన్ సీటర్ వేరియంట్ వినియోగంలో ఉంది. ఈ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్.. 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. అఫెన్సివ్ ఎయిర్ సపోర్టు తీసుకునేలా, గ్రౌండ్ ఆపరేషన్స్‌లో క్లోజ్ కంబాట్ సపోర్టును సమకూర్చేలా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డిజైన్ చేశారు.
ఈ తేజస్ ఫైటర్ జట్ అత్యంత చిన్న ఎయిర్‌క్రాఫ్ట్. విస్తృతంగా వినియోగించేందుకు వీలుపడేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం భారత వాయుసేనలో 40 తేజస్ MK-1 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో 83 తేజస్ MK-1 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆర్డర్ కూడా చేసింది. అందు కోసం రూ.36,468 కోట్ల డీల్ కూడా కుదుర్చుకుంది.
2025 కల్లా పాత కాలపు మిగ్-21 ఎయిర్‌క్రాఫ్ట్‌లను పూర్తిగా తీసేసి వాటి స్థానాన్ని లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అయిన తేజస్ మార్క్-1Aతో భర్తీ చేయాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్ణయించింది. 1963 నుంచి ఐఏఎఫ్‌లో సేవలు అందిస్తున్న మిగ్-21ల స్థానంలో తేలికపాటి యుద్ధ విమానాలను తీసుకొచ్చే కార్యక్రమం 1980లలోనే మొదలైంది. 2001 జనవరి 4న తొలి తేజస్ ఫైటర్ జట్ గాల్లోకి ఎగిరింది. ఆ రోజు భారత వైమానిక దళం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.