Tej Pratap Yadav : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ బీహార్ (Bihar) లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం, దాడులు జరుగుతుండటంపై జనశక్తి జనతా దళ్ చీఫ్ (JJD chief) తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ముప్పు పొంచి ఉందని, భద్రతను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మొకామా నియోజకవర్గ జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శికి మామ అయిన దులార్‌చంద్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తేజ్‌ప్రతాప్.. రాష్ట్రంలో రాజకీయ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాయత్నాలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ శత్రుత్వం కారణంగా తనను కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణ భయం ఉన్నందున భద్రతను మరింత పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
తమ పార్టీ తరఫున సుపాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిపై తేజ్ ప్రతాప్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ అభ్యర్థి మహాగఠ్‌బంధన్ అభ్యర్థి నుంచి మద్దతు కోరారని, ఇది పార్టీ విధానాలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను మే 25న పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు.
తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను పాటించకుండా చేస్తున్న చర్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తేజ్ ప్రతాప్ యాదవ్ ‘జనశక్తి జనతా దళ్’ పేరిట పార్టీని స్థాపించారు. బ్లాక్ బోర్డును పార్టీ గుర్తుగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను కూడా నిలిపారు. వైశాలి జిల్లాలోని మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ బరిలో ఉన్నారు.