Tej Pratap Yadav : రెండు రోజుల క్రితమే ఆర్జేడీ (RJD) పార్టీ నుంచి, లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav).. ఇవాళే (మంగళవారం) జన్మించిన తన తమ్ముడి కుమారుడికి ఆశీర్వాదాలు అందించారు. తన తమ్ముడు, మరదలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
‘నేను ఇవాళ మరో బిడ్డకు పెద తండ్రిని కావడం నా అదృష్టం. రెండో సంతానానికి తల్లిదండ్రులైనందుకు నా తమ్ముడు తేజస్వి యాదవ్‌కు, మరదలు రాజ్శ్రీ యాదవ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్తగా జన్మించిన బిడ్డకు నా ప్రేమపూర్వక ఆశీర్వచనాలు’ అని తేజ్‌ప్రతాప్ యాదవ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం తేజస్వి యాదవ్, రాజ్శ్రీ యాదవ్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు.
కాగా వ్యక్తిగత జీవితంలో కుటుంబ విలువలు, సంప్రదాయాలు పాటించడం లేదని, తన తీరుతో సామాజిక న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటాన్ని బలహీనం చేస్తున్నారని ఆరోపిస్తూ తేజ్ ప్రతాప్ యాదవ్‌ను రెండు రోజుల క్రితం ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించారు. తేజ్‌ప్రతాప్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, కుటుంబం నుంచి కూడా అతడిని వెలేస్తున్నామని లాలూ యాదవ్ అదివారం ప్రకటించారు.
తాను ఒక మహిళతో గత 12 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నానని తెలుపుతూ శనివారం తేజ్‌ప్రతాప్ యాదవ్ తన ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు గంటల్లోనే వైరల్ అయ్యి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దాంతో ఆ పోస్టు తాను పెట్టింది కాదని, ఎవరో తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారని తేజప్రతాప్ వివరణ ఇచ్చారు. అయినా లాలూ యాదవ్ ఆదివారం తేజ్ప్రతాప్పై వేటువేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ తేజ్‌ప్రతాప్ ఎక్స్‌లో శుభాకాంక్షల పోస్టు పెట్టడం గమనార్హం.