Madras HC : ప్రేమ జంటల మధ్య ముద్దులు, కౌగిలింతలు సహజమేనని అది నేరం కాదని మద్రాస్ హైకోర్టు (Madras High Court) అభిప్రాయపడింది. ఈ చర్యలను సెక్షన్ 354 ఎ (1)(i) కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అయితే లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం నేరమే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు.. ఓ యువకుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది.
కోర్టు నివేదికల ప్రకారం.. సదరు యువకుడు 2020 నుంచి 19 ఏళ్ల యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడు యువతిని ఓ చోటకు రమ్మని పిలిచాడు. అక్కడ వారిద్దరూ చాలాసేపు గడిపిన తర్వాత ఆమెను ముద్దాడి, కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది.
అయితే ఆమె ప్రతిపాదనను తిరస్కరించిన యువకుడు.. ఆమెకు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత కేసు కోర్టు దాకా వెళ్లింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్.. యువకుడి చర్యలకు సెక్షన్ 354 ఎ (1)(i) వర్తించదని స్పష్టంచేసింది. ప్రేమికుల మధ్య ఆలింగనాలు, చుంబనాలు సహజమేనని, ఈ కేసులో క్రిమినల్ ప్రోసీడింగ్స్కు అనుమతిస్తే చట్టాన్ని దుర్వినియోగపరిచినట్టేనని తీర్పు ఇచ్చింది.