న్యూఢిల్లీ: ఒక యువకుడు రోజులో 12 గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. ఒంటరిగా గదికే పరిమితమైన అతడు పబ్జీ (PUBG) గేమ్‌కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యాడు. పాక్షిక పక్షవాతం రావడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నడవలేక, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది పడుతున్న బాలుడ్ని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.
కాగా, మొబైల్ గేమ్స్‌కు బానిసైన ఆ యువకుడు స్కూల్‌కు వెళ్లకుండా ఏడాదిగా ఒంటరిగా రూమ్‌లో ఉంటున్నాడని డాక్టర్లు తెలుసుకున్నారు. రోజులో 12 గంటలపాటు అతడు పబ్జీ ఆడుతున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. పాక్షికంగా పక్షవాతం వచ్చిన ఆ బాలుడికి అధునాతన నావిగేషన్ టెక్నాలజీతో స్పైన్‌కు సర్జరీ చేసినట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, రోగి బాగా స్పందించాడని డాక్టర్లు వెల్లడించారు.
మరోవైపు మితిమీరిన మొబైల్ గేమింగ్ వల్ల కైఫో- స్కోలియోటిక్ వెన్నెముక వైకల్యానికి ఆ బాలుడు గురయ్యాడని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్ఐసీ) తెలిపింది. వెన్నెముక వైకల్యంతోపాటు మానసిక, సామాజిక ప్రభావం వంటి పలు సవాళ్లతో కూడిన కేసుగా పేర్కొంది.