లక్నో: స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణించింది. (Student Suicide) ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. శనివారం పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్లింది. అయితే రూ.800కుపైగా ఫీజు బకాయి ఉన్నందుకు పరీక్షకు అనుమతించలేదు. స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్ యాదవ్, అధికారి దీపక్ సరోజ్, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ యాదవ్, ఇతర సిబ్బంది ఆ విద్యార్థినిని అందరి ముందు అవమానించారు.
కాగా, ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి పనికి వెళ్లడంతో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి ఇరుగుపొరుగువారు ఆ ఇంటి ముందు గుమిగూడారు. పని నుంచి తిరిగి వచ్చిన తల్లి తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని హతాశురాలైంది.
మరోవైపు తాను ఇప్పటికే రూ.1500 ఫీజు చెల్లించానని, రూ.800 మాత్రమే బకాయి ఉన్నట్లు పోలీసులకు తల్లి చెప్పింది. కుమార్తె మరణానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.