జైపూర్: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక యువతిని రక్షించారు. అయితే హిజాబ్ తెచ్చుకునేందుకు తిరిగి గదిలోకి ఆమె వెళ్లింది. ఈ నేపథ్యంలో మంటల్లో కాలి మరణించింది. ఆ యువతితోపాటు పాటు 14 నెలల చిన్నారి కూడా ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయింది. (Jodhpur Cylinder Blast) మరో 14 మందికి కాలిన గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 7న సాయంత్రం 4.30 గంటల సమయంలో గులాబ్సాగర్ ప్రాంతంలోని మహ్మద్ సత్తార్ చౌహాన్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఆహారం తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ వల్ల సిలిండర్ పేలింది. దీంతో మూడంతస్తుల బిల్డింగ్‌కు మంటలు, పొగలు వ్యాపించాయి.
కాగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రెండో అంతస్తులోని గదిలో ప్రార్థన చేస్తున్న 19 ఏళ్ల సాదియా అక్కడ మంటల్లో చిక్కుకున్నది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సాదియాను రక్షించి ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఉమ్రా దీక్షలో ఉన్న ఆమె హిజాబ్ తెచ్చుకునేందుకు తిరిగి ఆ గదిలోకి వెళ్లింది. మంటల్లో కాలిన డోర్ సాదియాపై పడింది. తీవ్ర కాలిన గాయాలైన ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదంలో సాదియాతో పాటు 14 నెలల చిన్నారి కూడా చనిపోయింది. మరో 14 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే సాదియాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఏప్రిల్ 10న ఉమ్రా యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ అగ్ని ప్రమాదం బారిన పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.