లక్నో: పోలీస్ పేరుతో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ కాల్ చేశాడు. (Agra teacher gets scam call ) ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని చెప్పాడు. వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆ టీచర్ గుండెపోటుతో మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న మల్తీ వర్మకు సెప్టెంబర్ 30న వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను పోలీస్‌నని తెలిపాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని చెప్పాడు. లక్ష ఇవ్వకపోతే ఆమె కుమార్తె అసభ్య వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు.
కాగా, ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడికి ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. అయితే పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆ వాట్సాప్ కాల్ ఫేక్ అని టీచర్ కుమారుడు గుర్తించాడు. వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.
మరోవైపు ఈ సంఘటనతో చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.