పాట్నా: విద్యార్థినికి ఒక టీచర్ ప్రపోజ్ చేశాడు. ఏకలవ్యుడి మాదిరిగా గురుదక్షిణ చెల్లించాలని, తన ప్రియురాలిగా ఉండాలని కోరాడు. దీంతో స్కూల్ యాజమాన్యానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా ఇది వెళ్లింది. అయితే ఆ టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Teacher Asks Student To Be Girlfriend) బీహార్‌లోని కిసాన్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిసాన్ హైస్కూల్లో పని చేసే ఉపాధ్యాయుడు వికాస్ కుమార్ 12వ తరగతి విద్యార్థిని పలుమార్లు వేధించాడు. ఆమెతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాడు. ఏకలవ్యుడి మాదిరిగా గురుదక్షిణ చెల్లించాలని కోరాడు. తన ప్రియురాలిగా ఉండాలని చెప్పాడు. ఇద్దరం కలిసి సిలిగురికి వెళ్లి ఎంజాయ్ చేద్దామని ప్రతిపాదించాడు.
కాగా, టీచర్ వికాస్ కుమార్ వేధింపులపై ఆ విద్యార్థిని విసిగిపోయింది. స్కూల్లోని కొందరు టీచర్లకు ఈ విషయం చెప్పింది. అలాగే హెడ్మాస్టార్కు ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి ఇది వెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదు.
మరోవైపు ఉపాధ్యాయుడు వికాస్ కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. గురువారం ఆ స్కూల్ వద్ద ధర్నా చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సరిస్థితిని చక్కదిద్దారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించారు. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాగా, టీచర్ వికాస్ కుమార్ గతంలో ఆ స్కూల్లో పని చేసే మహిళా టీచర్‌కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.