ఢిల్లీ: లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)కు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల విధానం సరళీకృతం అవుతుందని టీడీపీ పేర్కొన్నది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా ఖర్చు తగ్గుతుందన్నారు. ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ద్వారా సుమారు లక్ష కోట్లు ఖర్చు అవుతుందని, అయితే జమిలి నిర్వహణతో ఆ ఖర్చు తగ్గే ఛాన్సు ఉందన్నారు. ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చింది.
జమిలి బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందు చర్చకు వచ్చిన సమయంలో.. ఆ బిల్లును పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపాలని ప్రధాని మోదీ సూచన చేసినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో.. కేంద్ర మంత్రి షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఐయూఎంఎల్ నేత ఈటీ మొహమ్మద్ బషీర్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్.. బిల్లును వ్యతిరేకించారు.