న్యూఢిల్లీ, జూలై 27 : భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని ఆయన అన్నారు. ఉద్యోగుల సంఖ్యను ఎందుకు తగ్గించవలసి వస్తోందన్న ప్రశ్నకు యావత్ ఐటీ పరిశ్రమ మార్పు చెందుతున్నదని, పని చేసే విధానాలు మారుతున్నాయని ఆయన బదులిచ్చారు.
విజయం సాధించాలంటే ఏ సంస్థ అయినా భవిష్యత్తు మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) వంటి నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ పని విధానాలలో మార్పులు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగులను వేరే విధంగా వాడుకోవడానికి అవకాశం ఉన్నచోట వారికి అవకాశాలు కల్పిస్తున్నామని, అలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో ఉద్వాసన తప్పదని ఆయన అన్నారు. 2025 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.13 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2 శాతం మంది అంటే సుమారు 12,200 మంది ఉంటారు. లేఆఫ్‌లు జూనియర్ లెవెల్లో కాకుండా మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ లెవెల్స్‌లో అధికంగా ఉంటాయని కృతివాసన్ స్పష్టం చేశారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లక్ష మందికిపైగా టెకీలపై వేటు పడింది. ఏఐ వినియోగం పెరగడం, ఆర్థిక మందగమనం, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఈ ఏడాది సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇటీవల ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం.
టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మేలో 6 వేల మందిపై, జూలైలో 9 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగుల తొలగింపు బాధించిందని సీఈ వో సత్యనాదెళ్ల అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో మెటా 3 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. కాగా, ప్రసూతి, మెడికల్ లీవ్‌లో ఉన్నవారినీ తొలగించారని విమర్శలు వచ్చాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ఐబీఎం ఏఐ వల్ల 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిం ది. ముఖ్యంగా హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తొలగింపుల ప్రభావం పడింది.
2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ 27 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. జూన్‌లో దాదాపు 100 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
సెర్చింజన్ దిగ్గజం గూగుల్.. క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ కారణంగానే ఈ నిర్ణయమని తెలిపింది.