న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల ప్రవాహం కొనసాగుతున్న వేళ టీసీఎస్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. 30 వేల నుంచి 40 వేల మందిని తొలగించినట్టు వార్తలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం ‘యునైట్’ చెన్నైలో ఆందోళనకు దిగింది. అయితే, టీసీఎస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తోసిపుచ్చింది. తమ సిబ్బందిలో 2 శాతం మందిపై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని స్పష్టం చేసింది. తొలగింపు వార్తల తర్వాత యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ (యునైట్) ఈ వారం చెన్నైలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది.
కనీసం 12,000 మంది మిడ్‌లెవల్, సీనియర్ లెవల్ ఉద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగిస్తున్నారని, చివరికి ఈ సంఖ్య 40,000కు చేరుకోవచ్చని ఆరోపించింది. నిరసనకారులు ‘చీఫ్ ఆఫ్ కార్పొరేట్ గ్రీడ్ (కార్పొరేట్ అత్యాశకు అధిపతి)’, ‘చీఫ్ ఆఫ్ క్రూయెల్టీ’ (క్రూరత్వానికి అధిపతి) వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. కంపెనీ 24.3 శాతం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, రూ. 45,588 కోట్ల డివిడెంట్ చెల్లింపులను ఉటంకిస్తూ తొలగింపుల అవసరాన్ని ‘యునైట్’ ప్రశ్నించింది.