PM Modi | జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశంపై కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. టూత్‌పేస్ట్ నుంచి ట్రాక్టర్ల వరకు ప్రతి వస్తువు ధరలపై పన్నుభారం తగ్గిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో పన్ను దోపిడీ జరిగిందన్న ఆయన.. భారీ పన్నులతో ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (UPITS)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజుల కిందట జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయని, ఇది నిర్మాణాత్మక మార్పుగా పేర్కొన్నారు. ఇవి భారతదేశ వృద్ధి కథకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ సంస్కరణలు జీఎస్టీ నమోదును సులభతరం చేస్తాయని.. పన్ను వివాదాలను తగ్గిస్తాయన్నారు. ఎంఎస్ఎంఈలకు రిటర్న్స్‌ను వేగవంతం చేస్తాయని.. ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాయన్నారు.
2014కి ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మిత్రపక్షాలు తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచడానికి ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పన్నుల ద్వారా భారీ దోపిడీ జరిగిందని.. దోచుకున్న డబ్బును మరింత దోచుకున్నారని.. దేశంలోని సామాన్య పౌరుడు పన్ను భారంతో ఇబ్బందిపడ్డాడని ప్రధాని పేర్కొన్నారు. తన ప్రభుత్వం పన్నులను గణనీయంగా తగ్గించిందని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టిందని, ప్రజల ఆదాయంతో పాటు పొదుపును పెంచిందన్నారు. రూ.12లక్షల వరకు ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించడం ద్వారా కొత్త జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడం ద్వారా పౌరులు ఈ ఏడాది రూ.2.5లక్షల కోట్లు ఆదా చేస్తారన్నారు. దేశం జీఎస్టీతో పొదు పండుగ జరుపుకుంటోందన్నారు.
2014కి ముందు అధిక పన్ను భారం వ్యాపార ఖర్చరులు, గృహ బడ్జెట్‌ను నిర్వహించడం కష్టతరం చేసిందని.. 2014కి ముందు రూ.1000 రేటు ఉన్న చొక్కాపై రూ.170 పన్ను విధించారన్నారు. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చాకి ఈ పన్ను రూ.50కి తగ్గిందన్నారు. సెప్టెంబర్ 22న అమలులోకి వచ్చిన సంస్కరణలతో అదే రూ.1000 విలువైన షర్ట్‌పై జీఎస్టీ రూ.35 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2014లో టూత్‌పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్ వంటి ముఖ్యమైన వస్తువులపై రూ.100 ఖర్చు చేస్తే రూ.31 పన్ను విధించారని, బిల్లు రూ.131 పెరిగిందని ఆరోపించారు. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రూ.100 విలువైన వస్తువు ధర రూ.118కి తగ్గిందని, అంటే రూ.13 ఆదా అవుతుందని.. ఇటీవలి జీఎస్టీ సంస్కరణల తర్వాత ఈ ఖర్చు రూ.105కి తగ్గిందని, ఫలితంగా 2014 ముందు రేట్లతో పోలిస్తే ప్రజలకు మొత్తం రూ.26 ఆదా అవుతుందన్నారు.
2014లో నిత్యావసరాల కోసం ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేసే కుటుంబం రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని.. జీఎస్టీ సంస్కరణల తర్వాత రూ.5వేల నుంచి రూ.6వేలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. 2014కి ముందు ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రూ.70వేల కంటే ఎక్కువగా పన్ను చెల్లించేదని.. ఇప్పుడు అదే ట్రాక్టర్‌పై రూ.30వేల మాత్రమే ఖర్చు అవుతుందని.. రూ.40వేల కంటే ఎక్కువగానే ఆదా అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన నాటి రోజుల పోలిస్తే ప్రస్తుతం స్కూటర్ల ధరలు రూ.8వేల నుంచి రూ.9వేలు తగ్గుతాయన్నారు. సంస్కరణల పేద, మధ్య తరగతుల వారందరికీ జీఎస్టీ సంస్కరణలతో ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని వివరించారు.