చెన్నై: లోక్‌భవన్ వర్గాల ఆహ్వానం మేరకు.. టీవీకే చీఫ్ సీ జోసెఫ్ విజయ్(TVK Chief Vijay) ఇవాళ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమ వద్ద ఉందని విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు గవర్నర్‌తో విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల వరకు అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేల గురించి గవర్నర్‌కు విజయ్ తెలియజేశారు.
అయితే విజయ్ ఇచ్చిన ప్రజెంటేషన్‌తో గవర్నర్ సంతృప్తి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంఖ్యా బలం అంశంలోనూ విజయ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ అర్లేకర్ ఆహ్వానించారు. శుక్రవారం లేదా శనివారం విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే రాజ్యాంగ ప్రకారం గవర్నర్ తన చర్యలు తీసుకోవాలని సీపీఐ కోరింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఉన్న లేఖలను సమర్పించాలని గవర్నర్ కోరినట్లు తెలిసింది. డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలని గవర్నర్ అడిగారని లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించాలని ప్రత్యక్షంగా విజయ్ను గవర్నర్ అర్లేకర్ కోరినట్లు సమాచారం.