చెన్నై: తమిళనాడు సీఎం విజయ్(CM Vijay).. శుక్రవారం కరూర్‌లో పర్యటించనున్నారు. 2025, సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. టీవీకే ప్రచార సభకు హాజరైన జనం.. నటుడు విజయ్ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే కరూర్ తొక్కిసలాటకు చెందిన సుమారు 32 మంది బాధిత కుటుంబాలకు రేపు సీఎం విజయ్ ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కూడా ఆయన సాయం చేయనున్నారు. కరూర్ పర్యటనలో మొత్తం 41 మంది కుటుంబాలను సీఎం విజయ్ కలుసుకోనున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు విమానంలో ఆయన తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కరూర్ వెళ్తారు. కరూర్-సేలమ్ బైపాస్ మార్గంలో ఉన్న అట్లాస్ కళైయరంగ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన 32 బాధిత కుటుంబాలకు పరిహారం కింద ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కరూర్ సమీపంలో 1700 కోట్లతో నిర్మించనున్న ప్రైవేటు నాన్ లెదర్ షూ తయారీ ఫ్యాక్టరీకి సీఎం విజయ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీ వల్ల సుమారు 13 వేల ఉద్యోగాలు కల్పించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆ మార్గంలో బందోబస్తు పెంచారు.