చెన్నై: ఎంత ఇచ్చినా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం తమిళనాడు సర్కారు కన్నీళ్లు కారుస్తోందని ఇటీవల ప్రధాని మోదీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్(CM Stalin) కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిధులు అడిగారో గుర్తు చేశారు. ఎంత ఇచ్చినా ఇక్కడ ఉన్నవాళ్లు ఏడుస్తున్నట్లు మోదీ ఆరోపించారని, ఎంత ఇచ్చినా మనం ఏడుస్తున్నామని మోదీ ఆరోపించడం సరికాదు అని స్టాలిన్ పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని, తమిళనాడులో హిందీ భాష అమలు చేయరాదు అని సీఎం స్టాలిన్ .. కేంద్ర మంత్రి షాను కోరారు.
నిధుల అంశంపై ఇటీవల రామేశ్వరం వెళ్లిన మోదీ అక్కడ కామెంట్ చేశారు. గత దశాబ్ధ కాలంలో 2014 కన్నా ముందు కంటే మూడు రెట్లు అధికంగా నిధుల్ని కేంద్రం రిలీజ్ చేసిందని ప్రధాని తెలిపారు. తమిళనాడులో మౌళిక సదుపాయాల్ని పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇక రైల్వే బడ్జెట్లో ఆ రాష్ట్ర కోటాను ఏడు రెట్లు పెంచినట్లు చెప్పారు. ఎంత కేటాయించినా, ఇంకా కావాలన్నట్లు కొందరు ఫిర్యాదు చేస్తున్నారని మోదీ ఆరోపించారు.