నటన, దర్శకత్వం, సంగీతం ఏ రంగంలో అయినా పరిచయం అవసరం లేని ప్రతిభ ఎస్.వి.కృష్ణారెడ్డిది. చిత్రసీమ మీద అంతులేని ప్రేమతో ఆటుపోట్లను ఎదుర్కొని, దర్శకుడిగా నిలదొక్కుకోవడమే కాదు, ఆరోగ్యవంతమైన సినిమా లెన్నో రూపొందించారు. మరిన్ని చిత్రాలకు సిద్ధపడుతూనే, న్యాయనిర్ణేతగా సరికొత్త పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ‘జీ తెలుగు’లో ప్రసారం అవుతున్న‘డ్రామా జూనియర్స్’లో అతిథిగా మెరుస్తున్నారు. తన సరికొత్త ప్రయాణం గురించీ, భవిష్యత్ ప్రణాళికల గురించీ ఆయన మాటల్లోనే!
పిల్లల్లో దాగిన కళను వ్యక్తీకరించేందుకు డ్రామా జూనియర్స్ చక్కటి వేదిక. ఒక నటుడిగా, దర్శకుడిగా వీళ్ల ప్రతిభను చూస్తుంటే నాకు అంతులేని ఉత్సాహం కలుగుతున్నది. అదే సమయంలో ఇక్కడ అరుదైన టాలెంట్ కూడా దొరుకుతుంది. అందుకే, నా అనుభవం, సృజన ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రేరేపించాయి. అక్కడి న్యాయనిర్ణేత స్థానంలో కూర్చున్న నేను, నాలోని దర్శకుడి కోణం నుంచి వాళ్ల నటనను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. వాళ్ల పట్టుదలను చూస్తుంటే, చిన్నప్పుడు మేము ఇంత తపనతో లేమే అని పశ్చాత్తాపం కూడా కలుగుతుంటుంది. ఇప్పుడే చెప్పను కానీ, నా భవిష్యత్ చిత్రాల్లో ఉపయోగపడే కొంతమంది ప్రతిభావంతులను కూడా వీరిలో గుర్తించాను.
గుర్తింపు చాలా అవసరం
ఇలాంటి కార్యక్రమాల వల్ల నటులకే కాదు, కళకు కూడా చాలా ఉపయోగం. వీరి ప్రతిభ లోకానికి పరిచయం కావడం మొదలైతే భవిష్యత్తులో రవీంద్రభారతి లాంటి గొప్ప కళావేదికల మీద ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావచ్చు కదా! అదే జరిగితే, టికెట్టు పెట్టి మరీ నాటకాన్ని చూసే మునుపటి రోజులు తిరిగి వస్తాయేమో! కళాకారుల సత్తా ప్రచారంలోకి వస్తే ప్రపంచమే వారి వెంటపడుతుంది. ప్రకాష్‌రాజ్ లాంటి నటులు అలా నాటకరంగం నుంచి పైకి వచ్చినవారే కదా! అందుకే, పిల్లల్లో నటనపట్ల, ఆ మాటకు వస్తే ఏ రంగంలో ఆసక్తి ఉన్నా తల్లిదండ్రులూ, సమాజమూ ప్రోత్సహించాలి.
కళ ఓ జీవనాధారం
‘కళ జీవితానికి, కెరీర్‌కు ఉపయోగపడుతుందా!’ అన్న సందేహాలు వద్దు. ఉపయోగపడనిది అంటూ కళలో ఏదీ లేదు. ‘ఒకప్పుడు పనికిరాని కళాకారుడు’ అనుకున్నవాడు కాలక్రమంలో పాపులర్ ఆర్టిస్ట్ కావడం ఎన్నోసార్లు గమనించాం. పైగా ఏ వయసులో వారైనా నటించే అవకాశం ఇక్కడి ప్రత్యేకత. కాస్త జాగ్రత్తగా గమనిస్తే కళారంగంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. యాంకర్లు, ఫొటోగ్రాఫర్లు, నటులు, వందలాది టెక్నీషియన్స్ ఇక్కడ పనిచేస్తుంటారు. ఒక్క సెట్ వేయడం కోసమే ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. ఒక్క కళాకారుడు నిలదొక్కుకోవడం వల్లే తన మీద లైట్స్ వేస్తున్నారు, తన డైలాగులు రికార్డు చేసుకుంటున్నారు. ఇదంతా ఉపాధే కదా!
అశ్లీలతకు తావు లేకుండా..
కొవిడ్ ప్రపంచం మొత్తాన్నీ కుదేలు చేసింది. అన్ని రంగాలనూ నష్టపరుస్తున్నది. శ్రమజీవులకు మరింత కష్టం కలిగించింది. ఆ విషయంలో మనందరికీ బాధగానే ఉంది. ఈ కొవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండటం వల్ల రెండు మంచి స్క్రిప్టులు డైలాగులతో సహా రాయగలిగాను. త్వరలోనే వాటిని పట్టాలెక్కిస్తాను. ఇప్పటివరకూ నా సినిమాలను అశ్లీలతకు తావు లేకుండా, స్త్రీలను అగౌరవపరచకుండా, విలువలకు కట్టుబడే రూపొందిస్తూ వచ్చాను. అందుకే ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారు. నా మార్క్ ఎప్పటికీ మారదు. నా రాబోయే సినిమాలు కూడా పూర్తిస్థాయి వినోదాత్మకంగా, కుటుంబకథా చిత్రాలుగానే ఉంటాయి. కొత్త దర్శకులు సినిమా తీయాలంటే ఎలాంటి అంచనాలూ ఉండవు. కానీ, 40 సినిమాలు తీసిన నా మీద ఎన్నో అంచనాలు ఉంటాయి. అవన్నీ నిరూపించుకోవడం కత్తిమీద సామే. అయినా ప్రయత్నిస్తాను. ‘సినిమా ఎవరు తీశారు, ఎంతలో తీశారు’ అన్నదానికంటే ఆద్యంతం ప్రేక్షకుడిని అలరించిందా లేదా అన్నదే ముఖ్యం కదా. అదే నా తాపత్రయం కూడా!
కొవిడ్‌లో ఒటీటీ, రియాలిటీ!
నేను తీసే సినిమా కొన్నాళ్లకి ఓటీటీలో వస్తుంది కాబట్టి, ప్రత్యేకించి అటువైపు ప్రయత్నాలు చేయడం లేదు. ఓటీటీ వల్ల సినీపరిశ్రమకు తప్పకుండా లాభమే! ఎందుకంటే, అది కూడా ఓ ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. చిన్న సినిమాలకు దన్నుగా నిలుస్తున్నది. అలాగని థియేటర్ అనుభవానికి మాత్రం అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. అందులో అనుమానమే లేదు. ఇదే సమయంలో డ్రామా జూనియర్స్ లాంటి రియాలిటీ షోస్ లాక్డౌన్, ఆ తర్వాత కూడా పిల్లలను కళల వైపు ఆకర్షించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ఇలాంటి నాటకాలతో వాళ్లకు భాష మీద పట్టు, ఏకాగ్రత, కలిసి పనిచేసే తత్వం అలవడతాయి. ఎవరు చెప్పగలరు ఎవరిలో ఏ ప్రతిభ ఉందో! అది ఎంతవరకు వెళ్తుందో! ఓ సాధారణ నటుడిగా ఉన్న అలీ యమలీల హీరోగా అద్భుతాలు సృష్టించాడు కదా! అదే ఊపులో ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా నిలిచాడు. టాలెంట్ నిరూపించుకోగలిగితే, అవకాశాలకు ఆకాశమే హద్దు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది!