చెన్నై, జూన్ 14: తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. మంత్రి ఇల్లు, కార్యాలయాల్లో కొన్ని రోజులుగా సోదాలు చేసిన ఈడీ మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం మంత్రిని అదుపులోనికి తీసుకొంది. అనంతరం వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ఆయనను తరలించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సెంథిల్ బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యంతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.
మంత్రికి కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించిన వైద్యులు వెంటనే ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. చట్ట ప్రకారం విధి విధానాలను పాటించకుండా, కుటుంబ సభ్యులకు తెలపకుండా తన భర్తను అరెస్ట్ చేశారని సెంథిల్ భార్య మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు కోర్టు అంగీకరించింది. దాడుల పేరుతో ఈడీ తమ మంత్రిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సెంథిల్‌ను ఆయన పరామర్శించారు. మరోవైపు సెంథిల్ బాలాజీకి ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జీ ఎస్ అల్లీ ఆదేశాలు జారీ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న మంత్రి పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
రాజకీయాల్లో ఉన్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలా?
సెంథిల్ అరెస్ట్‌ను విపక్షాలు ఖండించాయి. సెంథిల్‌ను అరెస్ట్ చేసిన విధానం అభ్యంతకరమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలకు బీజేపీ సైన్యం అని పేరు పెడితే బాగుంటుందని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అరెస్ట్‌ను తమిళనాట కొన్ని విపక్షాలతో కూడిన సెక్యులర్ ప్రొగెసివ్ అలయెన్స్ ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించింది.
ఈ నెల 23న జరగనున్న విపక్షాల సమావేశాన్ని దెబ్బ తీయడానికే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని అలయెన్స్ ఆరోపించింది. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ నేతల అవినీతిపై ఆధారాలతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈడీ చర్యలు బీజేపీ చేస్తున్న రాజకీయ వేధింపులని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. బీజేపీ ఇంత చేస్తున్నా తమిళనాడులో గెలవలేదన్నారు. బీజేపీ నాయకులు మూర్ఖుల స్వర్గంలో విహరిస్తున్నారని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతి ప్రాంతీయ పార్టీతో పాటు విపక్షాలన్నింటికీ నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తున్నదని పీడీపీ అధికార ప్రతినిధి నజ్మస్ సకీబ్ విమర్శించారు.