Tamil Nadu Governor : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత (TVK Chief) విజయ్ (Vijay) కి గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ (Rajendra Viswanath Arleker) షాకిచ్చారు. లోక్‌భవన్ (Lok Bhavan) లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కి ఆయన సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గుర్తుచేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టంచేశారు. దాంతో తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ మరింత ముదిరింది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 107 సీట్లు. విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టీవీకే బలం 107 మాత్రమే. మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దాంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలోనే మెజారిటీ లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
విజయ్ గవర్నర్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటామని చెప్పారు. అయితే ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. దాంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే ఉన్నది. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం (సుమారు 35 మంది) విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), సీపీఎం (2) వంటి పార్టీల మద్దతు కూడా కూడగట్టడంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు. మే 9న ప్రమాణస్వీకారం చేయాలని టీవీకే భావిస్తున్న తరుణంలో వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా మారాయి.