న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బిల్లుల విషయంలో తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పు బట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా తన వద్ద ఉంచుకుంటే ఎలా? అని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తగవు ఎలా పరిష్కారమవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమిళనాడు గవర్నర్ బిల్లులపై ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేయకుండా వ్యహరించరాదని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్రం ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌కు వ్యతిరేకత ఉంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం లేదా? గవర్నర్ మదిలో ఏముందో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని గవర్నర్ తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ బిల్లు ప్రతికూలంగాఉందని గవర్నర్ భావిస్తే, అది నచ్చకపోతే, అదే విషయాన్ని తెలియజేస్తూ దానిని పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోరాలి కదా? అని పేర్కొంది.