చెన్నై: తమిళనాడు గవర్నర్(Tamil Nadu Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన అనేక మంది తమిళ నేతల పేర్లను ఉచ్ఛరించారు. అయితే ఆ పేర్లు చదివే క్రమంలో ఆయన ఆ పేర్లను తప్పుగా పలికారు. దీని పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు గవర్నర్ అర్లేకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తమిళ సిద్ధాంతకర్తలు, సామాజిక సంస్కర్తలను ఉద్దేశిస్తూ గవర్నర్ మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన కొందరి పేర్లను ప్రస్తావించారు. పెరియార్ ఈవీ రామస్వామి, కే కామరాజ్, రాణి వేలూ నచియార్, అంజలీ అమ్మల్ లాంటి ప్రముఖుల పేర్లను ఆయన చదివారు. అయితే ఆ ప్రసంగం చేస్తున్న సమయంలో కొన్ని పేర్లను గవర్నర్ అర్లేకర్ తప్పుగా ఉచ్ఛరించారు.
వాస్తవానికి గోవా రాష్ట్రానికి చెందిన ఆయన తమిళ పేర్లను చదవడంలో కొంత ఇబ్బందిపడ్డారు. తన ప్రసంగంలోని ఓ పేరాను చదివిన తర్వాత ఆయన అకస్మాత్తుగా క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించండి, కొన్ని పేర్లను తప్పుగా చదివినట్లు పేర్కొన్నారు. మాజీ సీఎం అన్నాదురై ప్రసంగాలకు చెందిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గవర్నర్ అర్లేకర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సమానత్వం, విముక్తి, సోదరభావం సూత్రాలపై ప్రజాస్వామ్యం నిలబడుతుందని అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.