Governor Ravi | తమిళనాడుపై అక్కడి అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఘర్షణ సందర్భాల్లో కేంద్రం వైపు సివిల్ సర్వెంట్లు నిలబడాలని పిలుపునిస్తూ.. ఆలిండియా స్థాయి అత్యున్నత అధికారులను బీజేపీ వైపు తిరిగేందుకు ప్రయత్నం చేశారు. గవర్నర్ రవి వ్యాఖ్యల పట్ల పలువురు ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడంతో గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగం కాకుండా గవర్నర్ ఏం మాట్లాడినా సభ రికార్డుల నుంచి తొలగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అంతకుముందు రాష్ట్రానికి తమిళనాడు అని కాకుండా తమిళ్గం అని పేరు పెడితే బాగుంటుందని గవర్నర్ రవి అసెంబ్లీలో అన్నారు. దీనిపై అధికార డీఎంకే, మిత్రపక్షం కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) సభ్యులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఇలాఉండగా, తమిళనాడు ప్రభుత్వంతో ఘర్షణ నేపథ్యంలో గవర్నర్ రవి మంగళవారం సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్తో మాట్లాడుతూ.. ‘కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా కేంద్ర ప్రభుత్వం వైపు నిలబడాలి’ అని వారికి సూచించారు. ఇలా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కు చెప్పడం ముమ్మాటికీ వారిని కేంద్రంలోని బీజేపీకి మద్దతుదారులుగా ఉండాలనడమే అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత స్థాయి అధికారుల మధ్య అంతరాలు తీసుకొచ్చేలా గవర్నర్ స్థాయి వ్యక్తి మాట్లాడటం విచారకరమని పలువురు ఉన్నతాధికారులు చెప్తున్నారు.