న్యూఢిల్లీ : ఓ జంట తమ వివాహ వేడుకను వినూత్నంగా నిర్వహించి, నెట్టింట్లో వైరల్ అయ్యారు. అంతే కాదు ఆ జంట చేసిన పనికి విమాన సంస్థ స్పైస్‌జెట్‌పై డీజీసీఏ ఆగ్రహించింది. తమిళనాడు మధురైకి చెందిన రాకేశ్, దక్షిణ అనే నవ దంపతులు తమ వివాహాన్ని విమానంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్పైస్‌జెట్ కు చెందిన చార్డెట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు ఆ జంట. మొత్తం 161 మందితో ఆ విమానం మధురై నుంచి బెంగళూరుకు బయల్దేరింది. ఈ మధ్యలో విమానంలోనే వధూవరులు ఒక్కటయ్యారు. గాల్లోనే మాంగళ్యధారణ జరిగింది. ఫోటోలకు ఫోజులిస్తూ ఎంజాయ్ చేశారు. ఏ ఒక్కరూ కూడా కరోనా నిబంధనలు పాటించలేదు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు.
మొత్తానికి ఈ జంట వివాహం వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విమానంలో వివాహ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. విమాన సిబ్బందిని డీజీసీఏ సస్పెండ్ చేసింది. స్పైస్ జెట్‌పై కేసు నమోదుకు డీజీసీఏ ఆదేశించింది.
ఈ వ్యవహారంపై మధురై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కూడా స్పందించారు. నిన్న మధురై నుంచి బెంగళూరు వెళ్లేందుకు స్పైస్‌జెట్ చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తమకు తెలియదు అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎస్ సెంథిల్ వలవన్ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై స్పైస్ జెట్ సంస్థ స్పందించింది. వివాహ వేడుక కోసం ట్రావెల్ ఏజెంట్ ద్వారా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతి నిరాకరించబడుతుందని కూడా చెప్పాం. అయినప్పటికీ వారు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పైస్ జెట్ ప్రకటించింది.
DGCA has initiated investigations on mid-air marriage. It has sought a full report from the airline & Airport Authority. SpiceJet crew is off rostered. Airline directed to lodge complaint against those not following COVID appropriate behavior with relevant authorities: DGCA pic.twitter.com/aTNyjIKOFO
— ANI (@ANI) May 24, 2021