హైదరాబాద్, ఆగస్టు 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘పైండ్లెన పేదింటి ఆడబిడ్డకు లక్ష రూపాయల నగదుతో పాటు ఇందిరమ్మ కానుక కింద తులం బంగారం ఇస్తామ’ని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మాటతప్పారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నప్పటికీ, తులం బంగారం హామీని ఇంతవరకూ నెరవేర్చలేదు. అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు. ‘తాయి మమన్ తంగా మోతిరమ్ తిట్టమ్’ స్కీమ్ కింద ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ప్రతీ నవజాత శిశువుకు గ్రాము విలువ గల బంగారు ఉంగరాన్ని ఇస్తామని ఎన్నికల్లో విజయ్ హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడువక ముందే ఇప్పుడు ఆ హామీని ఆయన నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలోని 4.41 లక్షల మంది శిశువులకు రూ.755 కోట్లతో బంగారు ఉంగరాలను చేయించనున్నారు. ఈ మేరకు ప్రముఖ జ్యువెల్లరీ సంస్థలు జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెల్లరీస్కు ఆర్డర్ ఇచ్చారు. వచ్చే నెల ఈ ఉంగరాల పంపిణీ ఉండబోతున్నట్టు అధికారులు తెలిపారు.
తమిళనాడులో ఎన్నికల హామీలు జెట్ స్పీడ్‌తో అమల్లోకి వస్తుంటే, తెలంగాణలో మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో పట్టుమని పదింటిని కూడా కాంగ్రెస్ సర్కారు అమలు చేయలేదు. ‘తులం బంగారం’ హామీ విషయానికి వస్తే, రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకూ 4,30,293 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఈ లెక్కన ఒక్కొక్కరికీ తులం బంగారం చొప్పున లెక్కేసుకొంటే.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకూ 4,303 కిలోల బంగారం బాకీ పడినట్టు అర్థమవుతున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ సర్కార్‌పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.