వివాదాస్పదుడిగా పేరుగాంచిన తమిళనాడు గవర్నర్ రవి.. మంత్రి సెంథిల్ బర్తరఫ్‌పై యూటర్న్ తీసుకొన్నారు. అధికార డీఎంకేతో పాటు ఇతర అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి తొలగింపు నిర్ణయాన్ని నిలిపివేస్తూ సీఎం స్టాలిన్‌కు మరో లేఖ రాశారు.
చెన్నై, జూన్ 30: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మంత్రి తొలగింపు నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి తనకు సూచించారని, ఆ మేరకు ఏజీని సంప్రదిస్తున్నానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గురువారం రాత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు బర్తరఫ్‌ను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దీంతో మంత్రిని బర్తరఫ్ చేసే విషయంలో గవర్నర్ న్యాయ సలహాలు తీసుకోకుండానే నిర్ణయం తీసుకొన్నార నేది స్పష్టమవుతున్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, న్యాయ సలహా తీసుకోకుండా మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ రవి తీసుకొన్న నిర్ణయంపై అధికార డీఎంకేతో పాటు ఇతర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
సెంథిల్ మంత్రిగా కొనసాగుతారు!
ప్రభుత్వంతో సంప్రదించకుండా మంత్రి సెంథిల్‌ను బర్తరఫ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ శుక్రవారం గవర్నర్‌కు ఘాటైన లేఖ రాశారు. తన సూచన లేకుండా క్యాబినెట్‌లోని మంత్రిని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని తాము పట్టించుకోబోమని పేర్కొన్నారు. ‘నా మంత్రులను తొలగించేందుకు మీకు అధికారం లేదని పునరుద్ఘాటిస్తున్నా. ఎన్నికైన సీఎంకు మాత్రమే విశేషాధికారం ఉంటుంది’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. మంత్రి తొలగింపుపై మీరు(గవర్నర్) రాసిన రెండు లేఖలు చూస్తుంటే.. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొనేటప్పుడు న్యాయ సలహా తీసుకోనట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నారు. పోర్టుఫోలియో లేకుండానే సెంథిల్ బాలాజీ మంత్రి పదవిలో కొనసాగుతారని స్టాలిన్ స్పష్టం చేసినట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అన్నా డీఎంకే మాజీ మంత్రులపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరగా.. గవర్నర్ మౌనం వహించిన అంశాన్ని స్టాలిన్ హైలైట్ చేశారు.
ఆ నిర్ణయాన్ని పట్టించుకోం:డీఎంకే
సెంథిల్ బర్తరఫ్ వ్యవహారం ఇప్పటికే గవర్నర్ ఆర్ఎన్ రవి, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాల్లో మరింత కాకరేపింది. సెంథిల్‌ను తొలగిస్తూ గవర్నర్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తిరస్కరిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తెన్నారసు పేర్కొన్నారు. మంత్రి బర్తరఫ్ విషయంలో గవర్నర్ ఏకపక్షంగా, తొందరపాటుగా వ్యవహరించారని విమర్శించారు. ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని, అందుకు రాజ్యాంగబద్ధమైన ఆధారం కూడా లేదని పేర్కొన్నారు. ఒక నిర్ణయం తీసుకొనే ముందు మైండ్ పెట్టి ఆలోచన చేయాలని సూచించారు.