చెన్నై, సెప్టెంబర్ 3: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది ఓ పెద్ద కుట్ర అని, ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనేని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ రోజు మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న నియంతృత్వానికి మరో నిదర్శనమే జమిలి ఎన్నికల ఆలోచన. ఇది ఓ పెద్ద కుట్ర. ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనే. దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బలవంతంగా మనపై జమిలి ఎన్నికలను రుద్దాలనుకుంటున్నారు. ఈ కుట్రను పటాపంచలు చేయాల్సిందే’ అని పేర్కొన్నారు. దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినవాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారని, ఇది ముమ్మాటికీ తప్పు అని స్టాలిన్ వెల్లడించారు. ముందు మీ అవినీతికి (బీజేపీ నేతలను ఉద్దేశించి) ఫుల్స్టాప్ పెడితే బాగుంటుందని సూచించారు.