చెన్నై, ఏప్రిల్ 16: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ప్రతిని దగ్ధం చేసి దాన్ని నల్ల చట్టంగా అభివర్ణించారు. ఇది తమిళ ప్రజలను వారి సొంత భూమిలోనే శరణార్థులుగా మార్చాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి కొన్ని గంటల ముందు స్టాలిన్ నల్ల జెండాను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన డీలిమిటేషన్ బిల్లు ప్రతిని దహనం చేసి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం పశ్చిమ తమిళనాడులోని నామక్కల్‌లో పర్యటిస్తున్న స్టాలిన్ నల్ల దుస్తులు ధరించి బిల్లుపై నిరసన తెలిపారు. కలసి పోరాడి గెలుద్దాం వంటి నినాదాలతో డీఎంకే కార్యకర్తలు ఈ సందర్భంగా హోరెత్తించారు. డీఎంకే నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తమ నియోజకవర్గాలు, ఇండ్లపైన నల్ల జెండాలు ఎగురవేశారు. చెన్నైలోని డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయంతోపాటు నగరంలోని అనేక కీలక ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగిరాయి. డీఎంకే మిత్రపక్షాలైన కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్, వైకో సారథ్యంలోని ఎండీఎంకే కూడా తమ సంఘీభావం ప్రకటించాయి.
సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం
డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించినా, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డీఎంకే ప్రకటించింది. డీఎంకే అసెంబ్లీ ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేస్తూ, పార్టీ న్యాయ విభాగం కార్యదర్శి ఇలంగో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘దక్షణాది ప్రయోజనాల దృష్ట్యా కోర్టును ఆశ్రయిస్తాం. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం దక్కినా.. రాష్ట్రపతి ఆమోదం పొందగలదా? అన్నది సందేహమే’ అని అన్నారు. డీఎంకే మరో నేత ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టుపై మాకు విశ్వాసముంది. కోర్టును ఆశ్రయించడానికి మా వద్ద సరైన కారణాలు కూడా ఉన్నాయి’ అని అన్నారు. పీఎం మోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దును గుర్తుచేస్తూ, అది పూర్తిగా వైఫల్యం చెందిందని, దాని ద్వారా ప్రభుత్వం ఎలాంటి నల్లధనాన్ని రాబట్టలేకపోయిందని అన్నారు. అదే విధంగా మోదీ సర్కార్ తీసుకొస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ కూడా విఫలమవుతుందని అన్నారు. ఇది ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.