చెన్నై: హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించే నిర్ణయాన్ని పునరాలోచించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 18న చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవాలతో పాటు హిందీ మాసం ముగింపు వేడుకలను సంయుక్తంగా నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. ప్రధాని మోదీకి ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రాథమిక భాష కాని రాష్ట్రాల్లో హిందీని ప్రోత్సహించడంపై ప్రాంతీయంగా పెరుగుతున్న ఆందోళలను స్టాలిన్ ప్రస్తావించారు. ‘భారతదేశం వంటి బహుభాషా దేశంలో హిందీకి ప్రత్యేక హోదా కల్పించడం, హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ మాసాన్ని జరుపడం ఇతర భాషలను కించపరిచే ప్రయత్నమే’ అని ఆరోపించారు.
కాగా, భారత రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా కల్పించలేదని ఎంకే స్టాలిన్ తెలిపారు. అధికార ప్రయోజనాల కోసమే హిందీ, ఇంగ్లీష్‌ను ప్రధానంగా వినియోగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హిందీ ఎక్కువగా మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ ఆధారిత వేడుకలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ప్రతిపాదించారు.
ఒకవేళ హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ కార్యక్రమాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడితే ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషల వేడుకలను కూడా అంతే ఉత్సాహంతో జరుపాలని సీఎం స్టాలిన్ సూచించారు. అలాగే దేశంలో గుర్తింపు పొందిన అన్ని సాంప్రదాయ భాషల గొప్పతనాన్ని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వాటిని ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ భాషా వర్గాల మధ్య సత్సంబంధాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
I strongly condemn the celebration of Hindi Month valedictory function along with the Golden Jubilee celebrations of Chennai Doordarshan.
Hon’ble @PMOIndia,
The Constitution of India does not grant national language status to any language. In a multilingual nation, celebrating…
— M.K.Stalin (@mkstalin) October 18, 2024