కోయంబత్తూర్, డిసెంబర్ 27: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై ముందుగా ప్రకటించిన విధంగా కోయంబత్తూర్‌లోని తన స్వగృహంలో కొరడాతో కొట్టుకుని మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడిని నిరసిస్తూ, రాష్ర్టాన్ని పాలించడంలో, శాంతి భద్రతల వైఫల్యంలో డీఎంకే అసమర్థతకు ప్రాయశ్చిత్తంగా కొరడా దెబ్బలు కొట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో చెడు అంతమై పోవాలంటూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని మురుగన్‌కు మొక్కు చెల్లించుకుంటానని గురువారమే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం అన్నామలై ఒంటిపై చొక్కా లేకుండా కొరడాతో కొట్టుకుంటుండగా.. వెనుక ప్లకార్డులు పట్టుకుని నిల్చున్న కార్యకర్తలు ‘నీకు సిగ్గులేదా స్టాలిన్?’ అని నినాదాలు చేశారు. అన్నామలై చర్యను ఒక పెద్ద ప్రహసనంగా అధికార డీఎంకే కొట్టిపారేసింది. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో జరిగిన ఘటనలపై అన్నామలై ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.