చెన్నై, ఏప్రిల్ 25: యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఇందుకోసం స్టాలిన్ సర్కారు రాష్ట్ర యూనివర్సిటీల చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. సవరణ బిల్లును ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం వీసీలతో రెండు రోజుల కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం. బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. ఓటింగ్ సమయంలో అన్నాడీఎంకే వాకౌట్ చేసింది.
పూంచీ కమిషన్ సిఫారసుల ప్రస్తావన
బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు సీఎం స్టాలిన్ మాట్లాడారు. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. వీసీల నియామక అధికారం గవర్నర్ల చేతిలో ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదాలు తలెత్తుతాయని పూంచీ కమిషన్ గతంలో చేసిన సిఫారసులను ప్రస్తావించారు. వీసీల నియామకంలో రాష్ట్రప్రభుత్వానికి అధికారం లేకపోతే ఉన్నత విద్యపై దుష్ప్రభావం పడుతుందని అన్నారు. ‘ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వీసీలను గవర్నర్ నియమించడం లేదు. ప్రభుత్వమే నియమిస్తున్నది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే అమలు అవుతున్నది’ అని వ్యాఖ్యానించారు. ‘వీసీల నియామకం కేవలం తనకు మాత్రమే ఉన్న అధికారంగా గవర్నర్ భావిస్తున్నారు. సెర్చ్ కమిటీ రిపోర్టులను తిరస్కరిస్తూ వస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గతేడాది డిసెంబర్లో ఇదే తరహా బిల్లును ఆమోదించింది. కాగా ఇప్పటివరకూ తమిళనాడులో యూజీసీతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన ప్రొఫెసర్ల జాబితాను పరిశీలించిన సీఎంవో.. వీసీ ఎంపిక, ఆమోదం కోసం ఆ లిస్టును రాజ్‌భవన్‌కు పంపించేది.
ఉచితంగా ఇచ్చిన స్థలాలను అమ్మేసుకొంటరా!
విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చిన స్థలాన్ని ప్రైవేటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమ్ముకొని సొమ్ము చేసుకోవడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలానికి తగిన డబ్బు చెల్లించాలని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ను డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు కూడా ఇదే డిమాండ్ చేశాయి.
తెలంగాణలో వీసీల నియామకమిలా
తెలంగాణలో వీసీల నియామకం సెర్చ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక్కో వర్సిటీకి ఒక్కో సెర్చ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామిని, యూజీసీ నామిని, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామిని సభ్యుడిగా ఉంటారు. అయితే, తమిళనాడు సీఎం స్టాలిన్ ఉటంకించినట్టు తెలంగాణలో వీసీల ఎంపిక ప్రక్రియలో గవర్నర్ జోక్యం లేదన్నది అవాస్తవం. మన రాష్ట్రంలో అమలవుతున్న వీసీల నియామకపు ప్రక్రియ ఇలా ఉంది.
వీసీ నియామకానికి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది.
అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, ఆయా దరఖాస్తులను పరిశీలించి, షార్ట్ లిస్ట్ చేస్తారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి ప్రతి వర్సిటీకి ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాను ఈ సెర్చ్ కమిటీ పరిశీలించి, ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సీఎంకు పంపిస్తారు. ఈ పేర్లు సీఎంవో ద్వారా గవర్నర్‌కు పంపిస్తారు.
గవర్నర్ ఒక పేరును వీసీగా ఎంపికచేసి, తిరిగి సీఎంకు పంపిస్తారు.
సీఎంవో నుంచి ఈ ఫైల్ విద్యాశాఖకు చేరుతుంది. విద్యాశాఖ ఆమోదం లభించగానే వీసీలను నియమిస్తూ జీవోలు జారీచేస్తారు.