Actor Vijay : అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడు (Tamil Nadu) లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ పార్టీలు, సంఘాలు అన్నా యూనివర్సిటీ ముందు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ తమిళగ వెట్రి కజగమ్ (Tamilaga Vettri Kazhagam (TVK)) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (RN Ravi) ని కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై మాట్లాడేందుకే విజయ్ గవర్నర్ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే నటుడు విజయ్ ఈ లైంగిక దాడి ఘటనపై ఇప్పటికే స్పందించారు.
అన్నా యూనివర్సిటీ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, చాలా బాధించిందని నటుడు విజయ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారని, నిందితుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వాన్ని కోరానని, ఈ ఘటనలో ఇంకా ఎవరి హస్తమున్నా తగిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశానని ఆయన తన పోస్టులో తెలిపారు.