న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాముకాట్ల సమస్య ప్రబలంగా ఉందని, దవాఖానల్లో పాముకాటు బాధితుల చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ర్టాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాముకాట్ల బాధితులకు సరైన చికిత్స అందడం లేదని పేర్కొంటూ న్యాయవాది చాంద్ ఖురేషీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్ట్ ధర్మాసనం విచారించింది. పాముకాట్లతో సంభవిస్తున్న మరణాల రేటు భారత్‌లోనే అత్యధికంగా ఉందని పిటిషన్‌దారుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు చికిత్సకు ఇచ్చే యాంటీ-వీనొమ్ అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం.. ‘సమస్య దేశమంతా ఉంది. రాష్ర్టాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించండి. పాముకాట్ల చికిత్సకు ఏమైనా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది.
మిన్నంటిన ప్రయాగ్‌రాజ్ విమాన చార్జీలు
న్యూఢిల్లీ: మహా కుంభమేళా కొనసాగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు విమాన చార్జీలు హఠాత్తుగా పెరిగాయి. దీంతో కేంద్రం సోమవారం వివిధ ఎయిర్‌లైన్స్‌తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ నెల 29న మౌని అమావాస్య(రాజ స్నానం చేసే దినం) ఉన్న దరిమిలా వివిధ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన చార్జీలు ఒక్కసారి ఆకాశాన్నంటాయి. ట్రావెల్ పోర్టల్స్‌లో, జనవరి 28న చైన్నై-ప్రయాగ్‌రాజ్‌కు, రెండు రోజుల రిటర్న్ జర్నీ టిక్కెట్ ఛార్జీ రూ. 53,000 ఉంది. కోల్‌కతా నుంచి రిటర్న్ టికెట్ రూ.35,500గా ఉంది. హైదరాబాద్/ముంబై/ఢిల్లీ టికెట్ రూ.47,500 దాటగా బెంగళూరు నుంచి రూ.51,000 పలుకుతోంది.