జైపూర్: ఆస్తుల కోసం వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు వేధించారు. దొంగ సంతకాలతో కొన్ని ఆస్తులను లాక్కున్నారు. తిండి పెట్టకుండా వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని, అడుక్కొని బతకాలని హింసించారు. పిల్లల వేధింపులను తట్టుకోలేని ఆ వృద్ధ జంట ఆత్మహత్యకు పాల్పడింది. (Harassed By Children Couple Dies By Suicide) దీనికి ముందు కొడుకులు, కూతుళ్లు హింసించిన తీరును సూసైడ్ నోట్లో రాసి ఇంటిలోని గోడకు అంటించారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగౌర్‌లోని కర్ని కాలనీలోని ఇంట్లో 70 ఏళ్ల హజారీరామ్ బిష్ణోయ్, 68 ఏళ్ల అతడి భార్య చావలీ దేవి నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంకులో పడి ఉన్న వృద్ధ జంట మృతదేహాలను గుర్తించారు. అలాగే ఆ ఇంటి గోడకు అంటించిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను గమనించారు. కుమారులు రాజేంద్ర, సునీల్ వారి భార్యలతో కలిసి తమ పేరుతో ఉన్న ఆస్తి కోసం కొట్టి హింసించినట్లు తల్లిదండ్రులు అందులో ఆరోపించారు. కుమార్తెలు మంజు, సునీత కూడా తమ కుటుంబాలతో కలిసి తమను వేధించారని ఆ నోట్లో పేర్కొన్నారు.
మరోవైపు మూడు ప్లాట్లు, ఒక కారును దొంగ సంతకాలతో మోస పూరితంగా కొడుకులు, కుమార్తెలు తమ పేర్లపై మార్చుకున్నారని ఆ వృద్ధ దంపతులు ఆరోపించారు. అంతేగాక తమకు ఆహారం పెట్టకుండా వేధించారని, ఇంట్లోని గిన్నె తీసుకెళ్లి అడుక్కోవాలని కుమారుడు సునీల్ అన్నట్లు పేర్కొన్నారు. వేధింపుల గురించి ఎవరికైనా చెబితే చంపుతామని వారు బెదిరించినట్లు ఆరోపించారు. తమ పిల్లల వేధింపులు, హింసను తట్టుకోలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో రాశారు.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే తమను కేసులో ఇరికించేందుకు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కుమారుడు సునీల్ సోమవారం లేఖ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధ దంపతులు మంగళవారం మరణించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని ఎస్పీ వెల్లడించారు.